AP Elections 2024: సిక్కోలులో గెలుపు ఎవరిది? పార్లమెంట్, అసెంబ్లీ స్థానల్లో టీడీపీ, వైసీపీ, జనసేన ఎవరి బలం ఎంత?
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హీట్ పెరిగింది. అన్ని పార్టీలు గెలుపు ఓటములపై లెక్కలు వేసుకుంటున్నాయి. మరి ఏపీలో చిట్టచివరి జిల్లా అయిన శ్రీకాకుళంలో పరిస్థితి ఏంటి..? వైసీపీ, టీడీపీ, జనసేన ల్లో ఎవరి బలం ఎంత..? వచ్చే ఎన్నికల్లో గెలుపు జెండా ఎగరవేసేది ఎవరు..?
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎన్నికల హీట్ కనిపిస్తోంది. అన్ని పార్టీలు గెలుపు కోసం లెక్కలు వేసుకుంటున్నాయి. ప్రత్యేక వ్యూహాలతో ముందుకు అడుగులు వేస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఎన్నికల సమయం నడుస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల్లో రాజకీయ పరిస్థితులు.. ప్రధాన పార్టల బలాలు ఎంటో తెలుసుకుందాం.. ఇందులో భాగంగా మొదట శ్రీకాకుళం జిల్లా లో రాజకీయ పరిస్థితి ఏంటో చూద్దాం.. ఉద్యమాలకు పురిటిగడ్డ అయిన శ్రీకాకుళం.. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ వెనకబడిన ప్రాంతంగానే మిగిలిపోయింది. పార్టీలు మారినా.. ప్రభుత్వాలు మారినా.. బతుకులు మారడం లేదని అనుకుంటారు జనం ఇక్కడ. అలాంటి శ్రీకాకుళం రాజకీయం ఎప్పుడూ ప్రత్యేకమే.. ఉమ్మడి జిల్లాలో రాజకీయ ఆధిపత్యం ఎప్పటికప్పుడు చేతులు మారడం ఇక్కడ ప్రత్యేకత. మరి 2024 ఎన్నికల్లో గెలుపు ఎవరిది..? పార్లమెంట్ బరిలో నిలవబోయేది ఎవరు.. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ పార్టీ బలం ఏంటి, బలహీనత ఏంటి.. టీడీపీ మళ్లీ బౌన్స్‌బ్యాక్ అవుతుందా.. ఫ్యాన్ పార్టీ టాప్ స్పీడ్‌లో తిరుగుతుందా..?
శ్రీకాకుళం పార్లమెంట్ ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. ఎందుకంటే హస్తం పార్టీ అభ్యర్థులు తొమ్మిదిసార్లు గెలిచారు. ఇక టీడీపీ ఆవిర్భావం తరువాత పరిస్థితి మారింది. ఏడుసార్లు సైకిల్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించింది. అందులో ఎర్రంనాయుడు నాలుగుసార్లు గెలిచారు. ఎర్రంనాయుడు మరణం తరువాత ఆయన వారసుడు వరుసగా గెలుస్తున్నారు. ఇప్పుడు హ్యాట్రిక్ పై కన్నేశారు. 2014, 2019లో ఎంపీగా గెలిచి.. ఢిల్లీలోనూ, సిక్కోలు గల్లీలోనూ మంచి పేరు సంపాదించుకున్నారు. 2024 ఎన్నికల్లోనూ ఆయనే మళ్లీ బరిలోకి దిగేందుకు సిద్ధం అవుతున్నారు. వైసీపీ నుంచి గత ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేయగా.. 2024కోసం కొత్త అభ్యర్థి వేటలో పడినట్లు తెలుస్తోంది.
కళింగ సామాజికవర్గానికి చెందిన మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి.. వెలమ సామాజికవర్గానికి చెందిన ధర్మాన సోదరుల్లో ఒకరు ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి బరిలో దిగే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం నడుస్తోంది. రామ్మోహన్‌నాయుడు వెలమ సామాజికవర్గానికి చెందిన నేత కాగా.. ఈసారి ఆయనపై పోటీకి అదే సామాజివర్గానికి చెందిన అభ్యర్థిని వైసీపీ బరిలో దింపే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.
శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజవర్గాలు ఉన్నాయ్. గత ఎన్నికల్లో రెండింట్లో టీడీపీ.. ఐదు స్థానాల్లో వైసీపీ విజయం సాధించాయి. శ్రీకాకుళం అసెంబ్లీతో పాటు ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, నరసన్నపేట, ఆముదాలవలస సెగ్మెంట్‌లు సిక్కోలు పార్లమెంట్ పరిధిలోకి వస్తాయ్. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న అచ్చెన్నాయుడు, ధర్మాన సోదరులు, స్పీకర్ సీతారాం, మంత్రి సీదిరి అప్పలరాజు.. ఈ పార్లమెంట్ సెగ్మెంట్‌కు చెందిన నేతలే..
నియోజకవర్గాల వారీగా చూస్తే.. ఇచ్ఛాపురం: ఈ అసెంబ్లీ సీటు టీడీపీకి కంచుకోట. సైకిల్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత 8సార్లు ఎన్నికలు జరగగా.. ఏడుసార్లు విజయం వరించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా బెందాళం అశోక్ ఉన్నారు. 2014, 2019లో టీడీపీ నుంచి బెందాళం అశోక్ వరుసగా విజయం సాధించారు. గత ఎన్నికల్లో వైసీపీ హవాలోనూ గెలిచిన అశోక్.. పార్టీలో మంచి పేరు సాధించారు. 2024లోనూ ఆయన మరోసారి బరిలోకి దిగేందుకు సిద్ధం అవుతున్నారు. నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉండటం, కళింగ సామాజికవర్గ మద్దతు, మత్స్యకార గ్రామాల్లోనూ మంచి పట్టు ఉండడం.. అన్నింటికి మించి టీడీపీ కేడర్ బలంగా ఉండడం.. అశోక్‌కు కలిసి రానుంది. వైసీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన పిరియా సాయిరాజ్.. మళ్లీ టికెట్ వస్తుంది ఆశపడుతున్నారు. ఐతే గ్రూప్ రాజకీయాలు ఆయనకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ నర్తు రామారావు, మాజీ ఎమ్మెల్యే నరేశ్ కుమార్ అగర్వాల్, నర్తు నరేంద్ర టికెట్ ఆశిస్తున్నారు. వీరంతా ఎవరికి వారే అన్నట్లుగా రాజకీయం నడిపిస్తుండడంతో.. ఇచ్ఛాపురం వైసీపీలో గ్రూప్ వార్ పీక్స్‌కు చేరింది. వీరితోపాటు ఏపీ మారిటైమ్ బోర్డ్ చైర్మన్ కాయల వెంకట రెడ్డి కూడా వైసీపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. జనసేన నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన దాసరి రాజు, లొల్ల రాజేశ్ టికెట్ రేసులో ఉన్నారు. మత్స్యకార సామాజికవర్గంలో పవన్ ఫ్యాన్స్ భారీగా ఉన్నా.. క్షేత్రస్థాయిలో బలమైన కేడర్ లేకపోవడం జనసేనకు మైనస్. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమనే చెప్పాలి..
రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ హాట్‌టాపిక్‌గా ఉండే నియోజకవర్గం పలాస. మంత్రి సీదిరి అప్పలరాజు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గౌతు కుటుంబానికి ఈ నియోజకవర్గం పెట్టని కోట. అలాంటి ప్రాంతంలో మొదటిసారి బరిలో నిలిచి.. గౌతు కుటుంబం కంచుకోటను బద్దలుకొట్టారు సీదిరి అప్పలరాజు. రాబోయే ఎన్నికల్లోనూ ఆయనే బరిలో దిగే అవకాశాలు ఉన్నాయ్. ఇప్పటి నుంచే జనాలను కలుసుకోవడం మొదలుపెట్టారు. గడపగడపకు కార్యక్రమంలో భాగంగా ప్రతీ గ్రామాన్ని టచ్ చేస్తున్నారు. జనాల నుంచి సీదిరికి మంచి స్పందనే లభిస్తున్నా.. పార్టీలో స్థానికంగా గ్రూప్ రాజకీయాలు ఇబ్బంది పెడుతున్నాయ్. లోకల్ లీడర్లు దువ్వాడ శ్రీకాంత్, హేమబాబు చౌదరిలాంటి నేతలు.. సీదిరికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. పలాసలో మంత్రి అనుచరులు భూకబ్జాలు, అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారన్న విమర్శలు.. సీదిరికి మైనస్‌గా మారుతున్నాయ్. టీడీపీలో పరిస్థితి మరోలా ఉంది. పార్టీకి బలమైన కేడర్ ఉన్నా.. నియోజకవర్గ ఇంచార్జి గౌతు శిరీష సరిగా నడిపించలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయ్. మంత్రి సీదిరిని ఎదుర్కోవడంలో ఆమె విఫలం అవుతున్నార్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి శిరీషకు టికెట్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేనట్లు కనిపిస్తన్నా.. ఎన్నికల నాటికి ఏదైనా జరగొచ్చు అనే చర్చ వినిపిస్తోంది. పలాసలో జనసేన పార్టీ పుంజుకుంటోంది. పవన్‌తో పాటు జనసేన నేతలు నియోజకవర్గంలోని మత్స్యకార గ్రామాల్లో వరుస పర్యటనలు చేయడం.. యువతను ఆకట్టుకుంటోంది. టీడీపీ జనసేన పొత్తు ఉంటే.. కూటమిదే విజయం.. లేదంటే హోరా హోరీ పోరు తప్పకపోవచ్చు..
పార్లమెంట్ పరిధిలో మరో కీలక నియోజకవర్గం టెక్కలి.. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్.. 1994లో ఇక్కడి నుంచి పోటీ చేసి అప్పట్లో 40 వేలకు పైగా మెజారిటీతో చట్టసభలకు వెళ్లారు. ప్రస్తుత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014, 2019లో వరుసగా గెలిచిన అచ్చెం నాయుడు.. ఇక్కడి నుంచి మరోసారి బరిలో నిలిచి హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. వైసీపీ నుంచి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. ఈసారి టెక్కలి నుంచి బరిలో దిగబోతున్నారు. ఐతే దువ్వాడను గ్రూప్ రాజకీయాలు ఇబ్బంది పెడుతున్నాయ్. కేంద్ర మాజీమంత్రి కృపారాణి, కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్.. ఎవరికి వారే గ్రూప్‌లు నడిపిస్తున్నారు. లీడర్లు ఎక్కువ.. కేడర్ తక్కువ అన్నట్లుగా టెక్కలిలో వైసీపీ పరిస్థితి తయారయింది. దువ్వాడ శ్రీనివాస్ ఏకపక్ష ధోరణిని మిగిలిన వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయ్. టెక్కలిలో జనసేన ప్రభావం పెద్దగా లేదు. ప్రస్తుతం అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. మళ్లీ అచ్చన్ననే విజయం వరించొచ్చు..
నరసన్నపేటలో ధర్మాన కృష్ణదాస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే కొనసాగుతున్నారు కృష్ణదాస్. ఈ సారి కూడా నరసన్నపేట బరిలో వైసీపీ తరఫున ఆయన లేదా ఆయన కుమారుడు ధర్మాన కృష్ణ చైతన్య బరిలో దిగే అవకాశాలు ఉన్నాయ్. ధర్మాన క్రిష్ణదాస్ కుటుంబసభ్యుల వ్యవహార శైలితో.. వైసీపీకి కేడర్ రోజురోజుకు దూరం అవుతున్నారు. మరోవైపు కృష్ణదాస్.. పార్లమెంట్ బరిలో నిలిచే అవకాశం ఉందన్న చర్చ కూడా వినిపిస్తోంది. టీడీపీ నుంచి ఎవరికి టికెట్ వస్తుందన్న దానిపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఇంచార్జిగా ఉన్నారు. మెతక వైఖరితో ఇక్కడ పార్టీలో దూకుడు కనిపించడం లేదు. ఎంపీ రామ్మోహన్‌నాయుడు కూడా ఇక్కడి నుంచి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే బగ్గు లక్ష్మణరావు తనయుడు బగ్గు శ్రీనివాసరావు కూడా టికెట్ మీద ఆశలు పెంచుకుంటున్నారు. యువకులకు టికెట్ కేటాయిస్తే.. గెలుపు సాధ్యం అవుతుందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయ్. ఏమైనా వచ్చే ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ మధ్య టఫ్ ఫైట్ కనిపించే నియోజకవర్గాల్లో నరసన్నపేట టాప్‌లో ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ వైపే ఎడ్జ్ ఉన్నా..? టీడీపీ జనసేన కలిస్తే పరిస్థతి హోరాహోరీగా ఉండే అవకాశం ఉంది..
పాతపట్నంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా రెడ్డి శాంతి ఉన్నారు. కలమట కుటుంబానికి కంచుకోటగా ఉన్న పాతపట్నంలో.. గత ఎన్నికల్లో కలమట వెంకటరమణమూర్తిని ఓడించి రెడ్డి శాంతి విజయం సాధించారు. 2019 ఎన్నికల ముందు జనాలతో మమేకం అయినట్లు కనిపించిన రెడ్డి శాంతి.. గెలిచిన తర్వాత పార్టీని, ప్రజలను దూరంగా పెట్టారన్న విమర్శలు ఉన్నాయ్. నియోజకవర్గంలో మూడు మండలాల్లో ఎంపీపీలు, జడ్పీటీసీలు.. ఆమెకు వ్యతిరేకంగా ఉన్నారు. రెడ్డిశాంతికి మళ్లీ టికెట్ ఇస్తే పనిచేసేది లేదని తెగేసి చెప్తున్నారు. ఎమ్మెల్యే పీఏ… నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని.. సొంతపార్టీలోనే ఆగ్రహం వ్యక్తం అవుతోంది. దీంతో అధిష్టానం నిర్ణయం ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. కొత్తూరు ఎంపీపీ తులసి, తూర్పు కార్పు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, మాజీ డీసీసీబీ చైర్మన్ డోల జగన్.. ఎవరికివారి వచ్చే ఎన్నికల్లో టికెట్ తమకే అంటూ ప్రచారం చేసుకోవడం.. కేడర్‌ను కన్ఫ్యూజన్‌లో పడేస్తోంది. అలాగే టీడీపీ ఇంచార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణకు వర్గపోరు తప్పడం లేదు. తనకే టికెట్ అని కలమట ధీమాగా ఉన్నా.. ఆయనకు పోటీగా మామిడి గోవింద రావు టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటింటికి ఎంజీఆర్ అనే నినాదంతో.. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అధికార, విపక్షాలను గ్రూప్ రాజకీయాలు వెంటాడుతున్న వేళ.. పోటీ ఎలా ఉంటుందనే ఆసక్తి కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే హోరాహోరీ తప్పకపోవచ్చు..
గ్రూప్ రాజకీయాలకు కేరాఫ్‌గా ఉన్న ఆముదాలవలసలో.. స్పీకర్ తమ్మినేని సీతారాం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గ్రూప్ రాజకీయాలు ఇక్కడ వైసీపీని ఇబ్బంది పెడుతున్నాయ్. తమ్మినేని కుటుంబసభ్యులు నియోజకవర్గ రాజకీయాల్లో అతిగా జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇక్కడ కళింగ సామాజికవర్గ ఓటర్లు చాలా కీలకం. కళింగ నేతలే.. తమ్మినేనికి వ్యతిరేకంగా గ్రూపులు కడుతున్నారు. సువ్వారి గాంధీ, చింతాడ రవికుమార్, కోటా బ్రదర్స్.. తమ్మినేనికి సమాంతరంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇది ఆముదాలవలసలో వైసీపీకి భారీ మైనస్‌గా మారుతోంది. ఇక్కడ టీడీపీకి బలమైన కేడర్ ఉంది. దూకుడు రాజకీయం చేస్తున్న కూన రవికుమార్.. మేనమామ తమ్మినేనికి గట్టి పోటీ ఇస్తున్నారు. గ్రూప్ పాలిటిక్స్ లేకపోవడం ఇక్కడ టీడీపీకి కలిసొచ్చే అంశం. జనసేన పరిస్థితి చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. నియోజకవర్గ ఇంచార్జి పేడాడ రామ్మోహన్.. జిల్లాలో కీలక నేతగా ఎదిగినా.. క్షేత్రస్థాయిలో పార్టీ మరింత బలోపేతం కావాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కూన రవి మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది.
శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సీనియర్ నేతగా, రాజకీయ వ్యూహాలు అమలు చేయడంలో ధర్మాన ప్రసాదరావు దిట్ట. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఆయనే పోటీ చేయడం ఖాయం. తన మార్క్ పాలిటిక్స్ చూపించేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ఇక్కడ టీడీపీని గ్రూప్ రాజకీయాలు ఇబ్బందిపెడుతున్నాయ్. గుండా ఫ్యామిలీ నుంచి మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణ, ఆయన భార్య మాజీ ఎమ్మెల్యే లక్ష్మీ దేవి… పార్టీని బలోపేతం చేయడం కోసం నియోజకవర్గం అంతా తిరుగుతున్నారు. ఐతే టికెట్ రేసులో కొత్త వ్యక్తులు వచ్చి చేరడం ఆసక్తికరంగా మారింది. కింజారాపు కుటుంబానికి విధేయుడిగా ఉన్న గొండు శంకర్.. శ్రీకాకుళం నుంచి టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు. గుండ లక్ష్మీదేవికి సమాంతరంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. గ్రూప్ రాజకీయాలకు తెర తీస్తున్నారు. ఇది టీడీపీకి ఇబ్బందిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయ్. జనసేన నుంచి గత ఎన్నికల్లో కోరాడ సర్వేశ్వరరావు పోటీ చేయగా.. ఆ తర్వాత పెద్దగా ఇటు వైపు చూడలేదు. ఈ మధ్యే మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో మెరుస్తున్నారు. ఇక్కడ వైసీపీకే కాస్త ఎడ్జ్ కనిపిస్తోంది.
ఇక శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్, బీజేపీ ప్రభావం చూపించే పరిస్థితుల్లో లేవ్. ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీ మధ్యే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జిల్లాలో టీడీపీదే అధిక్యం అని నివేదికలు చెబుతున్నాయి.. జనసేన టీడీపీ కలిస్థే ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉండనుంది..
Comments
Post a Comment