Amaravati: అమరావతి రాజధాని వ్యవహారంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు... ఈ నెల 23న భవిష్యత్తు తేలేనా..?
Amaravati: ఏపీ రాజధాని ఏదీ.. ఈ ప్రశ్నకు సమాధానం సుప్రీం కోర్టు ద్వారానే తేలాల్సి ఉంది. ఎందుకంటే విశాఖ రాజధాని అని సీఎం జగన్ చెబుతున్నా..? విపక్షాలు మాత్రం అమరావతే రాజధాని అంటున్నాయి. ఇప్పటికే కోర్టులో కేసులు నడుస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది..
Amaravati: అమరావతి రాజధాని వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను.. త్వరితగతిన విచారించాలని.. రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది సుప్రీంకోర్టును ఇవాళ కోరారు. ఈ మేరకు జస్టిస్ కె.ఎం.జోసెఫ్ ధర్మాసనం దగ్గర ఈ అంశంపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఐతే గతంలో కోర్టు ఇచ్చిన నోటీసులు తమకు జనవరి 27న అందాయని.. రాజధాని కోసం పోరాటం చేస్తున్న రైతుల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. కౌంటర్ దాఖలు చేసేందుకు కనీసం 2 వారాల సమయమివ్వాలని కోరారు.
దీంతో ఈ నెల 23న విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపిందని చెబుతున్నారు. శాసనసభ నిర్ణయాలను తప్పుపడుతూ హైకోర్టు ఇచ్చిన తీర్పు పై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుండగా, రైతులు మాత్రం తమ ప్రయోజనాలకు భంగం కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని రైతుల తరుపున వాదిస్తున్నారు. త్వరగా విశాఖకు తరలి వెళ్లాలని ముఖ్యమంత్రి జగన్ యోచిస్తున్నారు. సుప్రీంకోర్టు ఈ కేసును త్వరితగతిన ముగించాలని కోరుతూ ఇటీవల సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ కు కూడా రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 2వ తేదీన విచారణకు సుప్రీం అంగీకారం తెలిపినట్టు సమాచారం.

Comments
Post a Comment