AP Capital: ఏపీకి మూడు రాజధానులు అబద్ధం.. ఒక్కటే అని స్పష్టత ఇచ్చిన బుగ్గన.. ఇంతకీ రాజధాని ఏంటంటే?

 AP Capital: ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు లేవా..? ఇంతకాలం ముఖ్యమంత్రి.. మంత్రులు చెబుతున్నది అంతా అసత్యమేనా..? ఈ మాట ఎవరో అంటే విపక్షాల విమర్శలు అనుకోవచ్చు.. కానీ ఏపీ మంత్రి బుగ్గనే స్వయంగా దీనిపై స్పష్టత ఇచ్చారు.. మూడు రాజధానులు అన్నమాట అవాస్తవం అన్నారు. 

AP Capital: అధికార వికేంద్రీకరనే తమ ధ్యేయం.. మూడు రాజధానులు నిర్మించి తీరుతాం.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెబుతున్న మాట ఇదే.. అసంబ్లీ వేదికగా కూడా సీఎం జగన్ ఇదే మాట చెప్పారు కూడా.. ఇటు ముఖ్యమంత్రి.. అటు మంత్రులు.. నేతలు అంతా పదే పదే ఇదే మాట చెబుతున్నారు. ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయడమే తమ లక్ష్యం అని ప్రకటనలు చేశారు. అయితే ఇదంతా ఉట్టి ప్రకటనలేనా..? అసలు మూడు రాజధానుల ఊసే లేదా..? ఏది వాస్తవం..  ఇలా ప్రశ్నించేది విపక్షాలు అయితే.. రాజకీయ విమర్శలు అని కొట్టి పారేయొచ్చు.. కానీ ఈ మాట చెప్పింది స్వయంగా ఏపీ మంత్రి బుగ్గన.. గ్లోబల్ ఇన్వెస్ట్​మెంట్​ సమ్మిట్ ప్రచారంలో భాగంగా బెంగుళూరులో నిర్వహించిన రోడ్ షోలో విశాఖ రాజధాని అంశంపై మంత్రులను పెట్టుబడిదారులు పలు రకాల ప్రశ్నలు అడిగారు. విశాఖ పైనే ఎందుకు దృష్టి పెట్టారు.. పారిశ్రామిక గ్రోత్ ఏరియాగా తిరుపతి, విజయవాడలను ఎందుకు ఎంచుకోలేదని ఆర్థిక మంత్రి బుగ్గనను పెట్టుబడిదారులు ప్రశ్నించారు. ఐటీ పరిశ్రమలు, సంబంధిత పెట్టుబడులను విశాఖకు ఆకర్షించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. విశాఖలో ఐటీ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ఐటీ పార్కులు, ఇతర మౌలిక సదుపాయాలు ఉన్నాయని స్పష్టం చేశారు..

ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు రాజకీయంగా మరో వివాదానికి తెరలేపుతోంది. తమ ప్రభుత్వం ఏపీ తదుపరి రాజధానిగా విశాఖనే నిర్ణయించిందని బుగ్గన స్పష్టం చేశారు. ఏపీకి మూడు రాజధానులు ఉన్నాయన్న అంశం పూర్తిగా తప్పుడు సమాచారమని కొత్త వాదన తెరపైకి తెచ్చారు. రాష్ట్ర పాలన అంతా విశాఖ నుంచి నిర్వహించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 

రాష్ట్ర విభజన తరువాత పాలనా రాజధానిగా విశాఖనే ఎంచుకోవడానికి కారణం.. అతి తక్కువ వ్యయంలో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయనేనని తెలిపారు. రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందేందుకూ విశాఖలో అవకాశం ఉందని అన్నారు. అక్కడి వాతావరణంతో పాటు పోర్టులు, పరిశ్రమలు ఉన్నాయి కాబట్టే విశాఖను రాజధానిగా ఎంచుకున్నామని వారికి మంత్రి క్లారిటీ ఇచ్చారు.  

అలాగే కర్నూలు అనేది రాజధాని కాదని.. అక్కడ కేవలం హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గుంటూరులో అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేయాలన్నది తమ నిర్ణయంగా పేర్కొన్నారు. గతంలో ఎప్పుడో జరిగిన శ్రీబాగ్ ఒప్పందం మేరకు మూడు ప్రాంతాల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తిరుపతి ప్రపంచానికే ఆధ్యాత్మిక రాజధాని అని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.

రాష్ట్ర విభజన సమయంలో ఏపీ నష్టపోయిందని.. అందుకే పారిశ్రామికంగా ఎదిగేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న పరిశ్రమలను సాధరంగా ఆహ్వానిస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు కేవలం హైదరాబాద్​లోనే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాయని.. జాతీయ సంస్థలను ఏర్పాటు చేశాయని తెలిపారు. అక్కడ పెద్ద ఎత్తున భూమి కూడా అందుబాటులో ఉండటంతో హైదరాబాద్​లో భారీ పరిశ్రమలు, రక్షణ రంగ సంస్థలు వచ్చాయన్నారు.

ప్రముఖ ఐటీ, ఉత్పత్తి సంస్థలు కూడా మొదటి ఉత్పత్తిని బెంగుళూరులోనే ప్రారంభించాయని గుర్తు చేశారు. హైదరాబాద్​, బెంగుళూరు లాంటి పెద్ద నగరాలు దేశంలోనే ప్రముఖంగా నిలిచాయన్నారు. విశాఖ-చెన్నై, చెన్నై-బెంగుళూరు, బెంగుళూరు- హైదరాబాద్ కారిడార్​లు ఏపీ నుంచి వెళ్తున్నాయన్నారు. ఈ మూడు కారిడార్​లలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు నీరు, విద్యుత్, భూమి, విమానాశ్రయం లాంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు.  

విశాఖ లాంటి అందమైన నగరాలు ప్రపంచంలోనే అరుదుగా ఉన్నాయన్నారు. హైదరాబాద్, బెంగుళూరు లానే అది కూడా కాస్మోపాలిటన్ నగరంగా మారుతోందన్నారు. ఐటీ రంగంలో విశాఖలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం విద్య, సంక్షేమ కార్యక్రమాలు, నైపుణ్యంపై దృష్టి పెట్టి వాటిపై ఎక్కువ వ్యయం చేసిందన్నారు. మూడు పారిశ్రామిక కారిడార్​లతో పాటు 888 కిలో మీటర్ల అంతర్గత జల రవాణా మార్గాలు కూడా ఉన్నాయన్నారు. 2029 వరకూ 10 మిలియన్ టన్నుల కార్గోను అంతర్గత జల రవాణా మార్గాల ద్వారా రవాణా చేసేలా ప్రణాళికలు చేశామన్నారు.

Comments

AATVNEWS

SEA MAFIA: సముద్రాన్ని కూడా వదలరా..? భయపెడుతున్న కొత్త మాఫియా?

AP Elections 2024: సిక్కోలులో గెలుపు ఎవరిది? పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానల్లో టీడీపీ, వైసీపీ, జనసేన ఎవరి బలం ఎంత?

Toddy Fruit Recipe: వరుసగా 40 రోజులు తాడిపండ్లు తింటే ఏం జరుగుతుంది? ఆ వంటకాలతో ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..