AP Capital Shifting: విశాఖ నుంచే ఇక సీఎం జగన్ పాలన.. ముహూర్తం ఫిక్స్.. క్యాంప్ ఆఫీస్ ఎక్కడంటే?
AP Capital Shifting: విపక్షాలు వద్దంటున్నాయి.. కోర్టులో అభ్యంతరాలు ఉన్నాయా..? న్యాయపరంగా తీర్పు రావాల్సి ఉంది.. అయినా.. విశాఖ నుంచి పాలించేందుకు జగన్ సిద్ధమయ్యారు.. ఎక్కడ నుంచి పాలన సాగించాలి.. రాజధానిని పూర్తిగా ఎప్పటికి సిఫ్ట్ చేయాలి అన్నదానికి సంబంధించి ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్టు టాక్..
AP Capital Shifting: ఏపీ రాజధాని విశాఖే.. సీఎం జగన్ ఇప్పటికే ఫిక్స్ అయ్యారు.. విపక్షాల వాదన ఎలా ఉన్నా..? కోర్టు తీర్పు ఎలా ఉండబోతున్నా.. ఆయన మాత్రం విశాఖ వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇటీవల ఆయన ఢిల్లీలో కామెంట్లు చేసిన తరువాత.. విశాఖలో హంగామా వేగంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో.. అది కూడా అతి త్వరలోనే విశాఖపట్నం రాజధాని కాబోతుంది అనే సంకేతాలు అందుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయమై అధికార యంత్రాంగం నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేనప్పటికీ మౌఖికంగా మాత్రం ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉండేందుకు బీచ్ రోడ్డులో అనువైన ఇంటి కోసం అన్వేషిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. వీవీఎంఆర్‌డీఏ అధికారులు ఇటీవల ఎంవీపీ న్యాయ విద్యా పరిషత్ పక్క నుంచి రహదారి విస్తరణ పనులు చేపట్టడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. సీఎం జగన్ నివాసం ఈ దారిలోనే ఉండే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు, మంత్రులు కూడా తమకు అనుకూలమైన ఇళ్ల కోసం గాలిస్తున్నట్టు విశాఖ లో ప్రచారం జరుగుతోంది.
మూడు రాజధానుల విషయంలో ఏదో ఒకటి చేశామనిపించుకోవాలనే పట్టుదలతో ఉంది ప్రభుత్వం. అందుకే మార్చి మూడోవారంలోనే విశాఖలో సీఎం క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసుకునే అవకాశముందని వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనకు ముందే విశాఖకు తాను రాబోతున్నట్టు, క్యాంప్ కార్యాలయం చూడండని జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో జిల్లా యంత్రాంగం అత్యంత గోప్యంగా సీఎం క్యాంప్ ఆఫీసుకోసం భవనాల అన్వేషణ జరుపుతున్నట్టు టాక్..
రుషికొండపైన నిర్మిస్తున్న పర్యాటక శాఖ ప్రాజెక్టు భవనాల్లో ఏర్పాటు చేయాలని తొలుత భావించారు. వచ్చే నెల మూడో వారానికి రుషికొండపై నిర్మాణాలు పూర్తికావని అధికారులు అంటున్నారు. తాత్కాలికంగా రుషికొండ, ఐటీ హిల్స్, మధురవాడ, కొమ్మాది ప్రాంతాల్లో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం నాలుగైదు భవనాలను పరిశీలించారని.. అలాగే బీచ్ రోడ్డులోని కొన్ని భవనాలతోపాటు, ఏయూలో వీసీ, రిజిస్ట్రార్ బంగ్లాలను కూడా పరిశీలించారని తెలుస్తోంది. అయితే ఈ అన్వేషణ మొత్తం గోప్యంగానే సాగుతోంది. త్వరలో ఈ అన్వేషణ పూర్తవుతుందని, జగన్ కు ఒక క్యాంప్ కార్యాలయం ఫైనలైజ్ అవుతుందని వైసీపీ ముఖ్య నేతల ద్వారా తెలుస్తోంది.

Comments
Post a Comment