TTD: అప్పుడలా..? ఇప్పుడిలా..? తిరుమల తిరుపతి దేవస్థానంపై రమణ దీక్షితులు తిరుగుబాటుకు కారణం అదేనా..?
TTD: గతంలో తెలుగు దేశం ప్రభుత్వంపైనా..? తిరుమల తిరుపతి దేవస్థానంపైనా.. ఓ రేంజ్ విరుచుకుపడ్డారు రమణ దీక్షితులు.. ఈ సందర్భంగా ఆయన వైసీపీ అధినేత జగన్ కు దగ్గర అయ్యారు. అయితే వైసీపీ అధికారంలోకి ఆయనకు టీటీడీలో తిరుగుండదు అనుకున్నారు..? ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది..? టీటీడీపై తిరుబాటు చేస్తున్నారు.. ఆయన తిరుగుబాటుకు కారణం ఏంటి..?
TTD: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల.. శ్రీవారి ఆలయంలో ఒకప్పుడు రమణ దీక్షితులు మాటే శాసనం.. ఆయన ఒకే చెబితేనే శ్రీవారి ఆలయంలో మార్పులు చేసే వారు.. కాలం మారే కొద్దీ పాలకుల్లో మార్పులు వచ్చాయి.. వంశ పార్యంపర్య అర్చకులకు... అర్హతకు తగట్లు అర్చకత్వం నిర్వహిస్తున్నారు. ఆయన మాట చెల్లుబాటు కావడం లేదు.. దీంతో పరోక్షంగా ఏపీ ప్రభుత్వంపై, ప్రత్యక్షంగా ఆలయ అధికారులపై విమర్శలు చేస్తూ.. సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు తాజా మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు.. తిరుమల గురించి తెలిసిన వారికి పెద్దగా పరిచయం అవసరం లేని వ్యక్తి ఆయన.. ఎందుకంటే ఒక్కపుడు శ్రీవారి దర్శనం తరువాత రమణ దీక్షితులు ఆశీర్వచనం తీసుకుంటే అంతా మంచే జరుగుతుందని భావించే వారు భక్తులు.. అయితే టీడీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ పాలకమండలి తీసుకున్న ఒక్క నిర్ణయంతో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చక పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో అప్పటి నుంచి తెలుగు దేశం పార్టీపైనా.. చంద్రబాబు పైనా తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు..
అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే.. దీక్షితులకు పెద్ద పీట వేసింది. జగన్ సీఎ బాధ్యతలు చేపట్టిన వెంటనే గౌరవ ఆలయ ప్రధాన అర్చక హోదా ఇచ్చింది.. దీంతో శ్రీవారి కైంకర్యాల పర్యవేక్షణకు మాత్రమే అనుమతి లభించింది. అప్పటి నుంచి రమణదీక్షితుల తీరు మాత్రం వివాదంగానే కొనసాగుతోంది. ఆలయ అర్చకులు రమణ దీక్షితులకు మధ్య ఆలయంలోనే గొడవలు జరిగిన సందర్భాలూ చాలా ఉన్నాయి..
తనకు గౌరవ ప్రధాన అర్చక పదవి వద్దని.. ప్రధాన అర్చక పదవి కావాలంటూ భీష్మించుకుని కూర్చున్నారు ఆయన. గతంలో టీడీపీని కాదని.. వైసీపీ వైపు వెళ్లిన రమణ దీక్షితులు ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంపై కూడా విమర్శలు చేస్తున్నారు. వివాదాలకు కేర్ అఫ్ అడ్రస్‌గా మారుతూ.. తన పంతం నెగ్గించుకోవాలని చూస్తున్నారు. ప్రమాదవశాత్తు ప్రధాన ఆలయంలో స్వామి వారి ఉత్సవ మూర్తులను నేలపై పడేలా చేశారనే విమర్శలూ లేకపోలేదు. ఈ సంఘటనల నేపథ్యంలో టీటీడీ మరోసారి వయో పరిమితి అంశాన్ని బోర్డులో ప్రవేశ పెట్టింది. ప్రవేశ పెట్టడం, ఆమోదం పొందడం శరవేగంగా జరిగాయి. దీంతో గొల్లపల్లి వంశానికి చెందిన రమణ దీక్షితులుతో పాటు మరో మూడు కుటుంబాలకు సంబంధించిన ప్రధాన అర్చకులకు టీటీడీ రిటైర్మెంట్ ప్రకటించింది. వారితో పాటు తిరుచానూరు, గోవిందరాజ స్వామి ఆలయానికి చెందిన మరి కొంత మంది అర్చకులు కూడా ఉద్యోగ విరమణ పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే ఖాళీ అయిన పోస్టులను అదే కుటుంబానికి చెందిన వారిని నియమించింది టీటీడీ. రమణదీక్షితులు సుప్రీం కోర్టును ఆశ్రయించగా... తిరుచానూరు, గోవిందరాజ స్వామి మిరాశీ అర్చకులు హైకోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానంలో విచారణలో ఉండగా... హైకోర్టు మిరాశీ అర్చకులపై గత సంవత్సరం డిసెంబర్ 14న స్పష్టమైన తీర్పు ఇచ్చింది. మిరాశీ అర్చకులు ఉద్యోగులు కాదనీ, వారికి టీటీడీ సర్వీసులు వర్తించవని తేల్చి చెప్పింది ఏపీ ధర్మాసనం.. వారిని అర్చకత్వానికి అనుమతించాలని ఆదేశించింది. ఈ తీర్పు మాత్రం తిరుచానూరు రిటైర్మెంట్ అయిన అర్చకులకు మాత్రమే వర్తిస్తాయంది.. ఈ విషయంలోనూ టీటీడీ కోర్టుకు అప్పీల్‌కు వెళ్లింది.. రిటైర్ అయిన వారిని మళ్లీ విధుల్లోకి తీసుకుంటే వేదవిజ్ఞాన ప్రవేశిక సర్టిఫికెట్స్ ఉన్న మిరాశీ కుటుంబానికి చెందిన 12 మందిని అర్చకులుగా టీటీడీ నియమించింది. ఉద్యోగ విరమణ చేసిన వారిని మళ్లీ ఆలయ విధుల్లోకి తీసుకుంటే వీరి భవిష్యత్ ఎలా అనే అంశంపై టీటీడీ సందిగ్ధంలో పడింది.
అయితే గతంలో మిరాశీ అర్చకుల ఉద్యోగ విరమణ అనే అంశాన్ని రాజకీయం చేస్తూ... అప్పటి అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూ రమణదీక్షితులు పావులు కదిపారు. రిటైర్మెంట్ అంశం తెరపైకి రాగానే అప్పటి అధికారంలో ఉన్న ప్రభుత్వంపై, టీటీడీ అధికారులపై తీవ్ర విమర్శలు, అభాండాలు వేశారు. దీంతో రమణదీక్షితులుపై ప్రభుత్వం సీరియస్ అయింది. దీంతో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డిని కలిసి తమ వంశ పారంపర్య వృత్తిననీ, అర్చకత్వాన్ని కొనసాగించేలా చేయాలని కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన జగన్... పార్టీ అధికారంలోకి రాగానే అర్చకుల సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చారు. బహిరంగ సభల్లోనూ ప్రకటించారు. జగన్ సీఎం కావడంతో అర్చక హోదాలో తనకు ఆలయ ప్రవేశం కచ్చితంగా జరుగుతుందని రమణ దీక్షితులు ఆశించారు. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ఆలయ ప్రధాన అర్చక హోదాను కల్పించింది. దీంతో ఆలయ ప్రవేశం చేసిన రమణ దీక్షితులు.. తన తోటి అర్చకులతో ఆలయంలోనే మాటల యుద్ధానికి దిగే వారు. తనకు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చక హోదా ఇవ్వాలని ప్రభుత్వం, టీటీడీ అధికారులను కోరారు. కానీ అలా చేస్తే ప్రస్తుతమున్న అర్చకులకు అన్యాయం చేసిన వారమవుతామని భావించిన ప్రభుత్వం ఈ అంశాన్ని పక్కనబెట్టింది.
అందుకే రమణ దీక్షితులు తనకు అవకాశం దొరికినప్పుడల్లా ట్విట్టర్ వేదికగా.. టీటీడీ అధికారులపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆ ట్వీట్లలో సీఎం జగన్‌ను ట్యాగ్ చేస్తూ వచ్చే వారు. చిన్న అంశాన్ని సైతం తన ట్వీట్‌తో సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వంపై., ఆలయ అధికారులపై శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు సంచలన ఆరోపణలు చేశారు. ట్విట్టర్ వేదికగా ఏపీలోని దేవాలయాలు, ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ట్వీట్ చేసిన రమణ దీక్షితులు.. ఏపీలోని ఆలయాల్లో ఆగమ శాస్త్రాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారని ఆరోపణలు చేశారు.
Comments
Post a Comment