TTD: స‌ర్వ‌భూపాల‌ వాహనంపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి.. శేష వాహనంపై కపిలేశ్వరుడు.. వైభవంగా బ్రహ్మోత్సవాలు

 TTD: కలియుగ వైకుంఠంగా భావించే సప్తగిరులలో నిత్యం సేవలు జరుగుతూనే ఉంటాయి.. వివిధ రూపాల్లో దర్శనం ఇస్తూ భక్తులకు తన్మయత్వం కలిగిస్తారు శ్రీ వెంకటేశ్వర స్వామి.. మంగళవారం సైతం జరిగిన వాహన సేవలు.. వైభవంగా సాగాయి.  

TTD: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి నిత్యం ఏదో ఒక రూపంలో భక్తులకు దర్శనం ఇస్తూనే ఉన్నారు. ప్రస్తుతం శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నాల్గవ రోజైన మంగళవారం రాత్రి అనంత తేజోమూర్తి అయిన శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీనివాసుడు బ‌కాసుర‌వ‌ధ‌ అలంకారంలో సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు వృషభాలు, గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

సర్వభూపాల వాహన సేవకు చాలా ప్రత్యేకత ఉంది. సర్వభూపాల అంటే రాజులందరు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ ఇస్తుందని తిరుమల పండితులు చెబుతున్నారు. 

అంతకుముందు వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలోని కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లకు మంగళవారం స్నపన తిరుమంజనం (పవిత్రస్నానం) శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రధాన కంకణభట్టర్‌ శ్రీ బాలాజి రంగాచార్యులు ఆధ్వర్యంలో ఈ విశేష ఉత్సవం నిర్వహించారు.

ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, పెరుగు,తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రములు, దివ్యప్రభందములోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే పాశురాలను అర్చకులు పఠించారు. ఈ వేడుకలో ఒకో క్రతువులో ఒక మాల వంతున రోజా , సంపంగి తదితర ఏడు రకాల మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. మరోవైపు  తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన మంగళవారం రాత్రి శ్రీ కపిలేశ్వరస్వామివారు కామాక్షి అమ్మవారి సమేతంగా శేష వాహనంపై అభయమిచ్చారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది. 

వేంకటాచలంపై శిలలన్నీ ఆదిశేషుని పడగలే. శ్రీకూర్మం మీద ఆదిశేషుడు – ఆ ఆదిశేషునిపై భూమండలం – ఆ భూమిని ఛేదించుకుని పైకి వచ్చిన పాతాళ మహాలింగం కపిలమహర్షిచే పూజింపబడింది. ఆ లింగం వెలసిన ఈ ప్రదేశం కైలాసం వంటి మహిమాన్విత దివ్యక్షేత్రం. ఆదిశేషుని పడగలపైనున్న మణులతో కపిలలింగం, నిరంతరం దీపకైంకర్యాన్ని అందుకుంటోంది. 














Comments

AATVNEWS

SEA MAFIA: సముద్రాన్ని కూడా వదలరా..? భయపెడుతున్న కొత్త మాఫియా?

AP Elections 2024: సిక్కోలులో గెలుపు ఎవరిది? పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానల్లో టీడీపీ, వైసీపీ, జనసేన ఎవరి బలం ఎంత?

Toddy Fruit Recipe: వరుసగా 40 రోజులు తాడిపండ్లు తింటే ఏం జరుగుతుంది? ఆ వంటకాలతో ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..